ప్రజాశక్తి - హైదరాబాద్ ప్రతినిధి Sun, 29 Jan 2012, IST
- భర్తీకి నోచని 4.5 లక్షలు పోస్టులు
- ఖాళీల భర్తీ కోసం మే 18న
- జంతర్‌మంతర్ వద్ద ధార్న
- అఖిలభాతర రైల్వే ఎంప్లాయీస్
- కాన్ఫెడరేషన్
ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా కాంట్రాక్టీకరణ, ఔట్‌సోర్సింగ్ విధానాలు అవలంభించడం వల్ల రైల్వే వ్యవస్థ నిర్వీర్యం అవుతోందని అఖిలభారత రైల్వే ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. రైల్వేల్లో భర్తీకి నోచని 4.5 లక్షల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ కాన్ఫెడరేషన్ ఆధ్వర్యంలో మే 18న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నారు. దీనికి సిఐటియు, ఎఐటియుసి తమ సంపూర్ణ మద్దతు తెలిపాయి. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాన్ఫెడెరేషన్ ఆలిండియా ప్రెసిడెంట్ బిఎన్‌ఎస్‌ఎప్ శ్రీనివాసరావు, ఎస్‌సి జోన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కామేశ్వరరావు, జోనల్ ప్రధాన కార్యదర్శి అహ్మద్ మొహియుద్దీన్, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు పి రాజారావు, ఎఐటియుసి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టి నర్సింహన్ మాట్లాడారు. 17.5 లక్షల ఉద్యోగులకుగానూ ప్రస్తుతం 13లక్షల ఉద్యోగులు మాత్రమే ఉన్నారని, 4.5లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా కీలకమైన విభాగాల్లో కాంట్రాక్టీకరణ, ఔట్‌సోర్సింగ్ విధానాలు అవలంభిస్తున్నారని విమర్శించారు. జనాభాతో పాటు రైళ్లు, స్టేషన్లు పెరిగాయని, కానీ పోస్టులు మాత్రం తగ్గిపోయాయని అన్నారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయక పోవడం వల్ల పనిభారం పెరిగిందని, దీంతో ఉద్యోగులు ఒత్తిళ్లకు లోనవుతున్నారని అన్నారు. దీనివల్ల ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టీకరణను వెంటనే రద్దు చేసి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, దీంతో ప్రమాదాలను నివారించడంతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. ఖాళీ పోస్టులను భర్తీచేయాలనే ప్రధాన డిమాండ్‌తో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఎసి కోస్ అటెండెంట్స్‌కు సంబంధించి 662పోస్టులను భర్తీ చేస్తామని అంగీకరించినా నిధుల్లేక ఆగిపోయాయంటూ అధికారులు చెతున్నారని అన్నారు. కమర్శియల్, క్యాటరింగ్, ట్రాక్ మెయింటెనెన్స్, పారిశుధ్యం (సఫాయి), టెలీ కమ్యూనికేషన్, లైటింగ్, లగేజీ కంపార్ట్‌మెంట్, ఫ్లాట్‌ఫారాలు, రైల్వే హాస్పిటల్స్‌లో కాంట్రాక్టీకరణ, ఔట్‌సోర్సింగ్ పరిధిలోకొచ్చాయన్నారు. లాలాగూడతో పాటు ప్రధాన రైల్వే ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ పద్ధతిపై డాక్టర్లను తీసుకుంటున్నారన్నారు. రైల్వే ట్రాక్‌ల నిర్వహణ చూసే గ్యాంగ్‌మెన్లు నేడు లేకుండా పోయారని, వాటిని కూడా కాంట్రాక్టర్ల పరం చేశారని దీంతో ప్రయాణీకుల భద్రత ప్రమాదంలో పడిందని అన్నారు. రైల్వే క్యాంటీన్లు ప్రయివేటు పరం చేయడం వల్ల ధరలు పెరిగాయని, ప్రయాణీకులపై భారం పడిందని, వస్తువుల నాణ్యత లేకుండా పోయిందని అన్నారు. రైల్వేల్లో అధికారుల పోస్టులు పెంచుతూ కిందిస్థాయి పోస్టులను తగ్గిస్తున్నారని విమర్శించారు. ఎసి కోచ్‌లలోని అటెండెంట్ 36గంటలు డ్యూటీ చేయాల్సి వస్తోందని వారికి కూడ డ్రైవర్స్, గార్డ్స్‌లా జురిడిక్షన్ నిర్ణయించి 8గంటల పనివిధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. నూతన ఆర్థిక విధానల కారణంగా ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానాన్ని పెంచి పోశించడాన్ని సిఐటియు, ఎఐటియు నాయకులు ఖండించారు. రైల్వే ప్రయాణీకుల్లో అభద్రతాభావం ఉందని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనాలు ఇవ్వడం లేదని ఉద్యోగుల మధ్య విభేదాలను సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. వెంటనే ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కాన్ఫెడరేషన్ ఉద్యమానికి పూర్తి మద్దతు తెలిపారు
No comments:
Post a Comment