బీ ఎలర్ట్ : నంగేళి
"నంగేళి" ఈ పేరు ఇతిహాస గ్రంథాలలో లిఖించబడలేదు. చరిత్ర పుటల్లో ఎక్కించబడలేదు. బంధనాల ఛేదన నేపథ్యాల్లో స్థానం కల్పించబడలేదు. సాహసకార్యాల సరసనా చేర్చబడలేదు. గతం జ్ఞాపకాల కొలమానంలోనూ ఇమడ్చబడలేదు. ఐనా 'నంగేళి' పేరు నేటికీ వినబడతూనే ఉంది. సజీవంగా సమాజంలో నడయాడతూనే ఉంది. అణచబడ్డ జాతుల్లో నేడు రవికను ధరిస్తున్న ప్రతీ ఆడబిడ్డ గుండెలను తడుముతూనే ఉంది. వారి అస్థిత్వాన్ని ప్రశ్నిస్తాఉంది. విముక్తి దిశగా వేసే ప్రతీ అడుగు మార్గమై నిలుస్తుందన్న సత్యాన్ని బోధిస్తా ఉంది.
అది 19వ శతాబ్ద ప్రారంభకాలం. మనుస్మృతి ఆధారంగా మనుషుల్ని వారి కులాల్ని బట్టే చూడటం కొనసాగుతోంది. ఆహార, వస్త్ర ధారణ నియమాలను నిర్ణయించి వాటి అతిక్రమణకు పాల్పడిన వారికి శిక్షలు వేయటం జరుగుతోంది. విపరీతమైన అసమానతలు రాజ్య మేలుతున్నాయి. బ్రిటీష్ వారి ఆగమనంతో మొదలయిన విద్యా వ్యాప్తి కారణంగా మనుషులుగా కూడా గుర్తింపుకు నోచుకోని కొన్ని అస్పృశ్యకులాల మరికొన్ని శూద్రకులాల వారి జీవనాల్లో చైతన్య వంతమైన సామాజిక మార్పు చొరబడుతోంది. ఆ దిశగా ఆలోచనలు మొలకెత్త నారంభించాయి. వర్ణధర్మాన్ని నమ్మి పాలన అందిస్తున్న కేరళలోని బ్రాహ్మణ ట్రావెన్ కోర్ సంస్థానాదీశులు కుల కట్టుబాట్లను పటిష్ట పరిచే పనికి పూనుకున్నారు. సాంఘిక జీవనాల్లో మార్పులు చోటు చేసుకోకుండా నిమ్న వర్గాల్లో ఉచ్ఛస్థాయి జీవన పద్దతులు చొరబడినా నిలబడకుండా అధిమిపెట్టే ఎత్తుగడలకు తెరలేపారు. క్రింది కులాలమహిళలు పై భాగం(చెస్ట్) కప్పుకోవటం ఆనాటికి ఆప్రాతంలో వున్న వస్త్ర ధారణ పద్ధతుల్లో లేదు. ఒకవేళ ఎవరైనా శూద్రకులాలలోని మరియు అస్పృశ్య కులాలలోని ఆడవాళ్లు అలా కప్పుకోదలిస్తే పన్ను కట్టాలని " బ్రెస్ట్ టాక్స్" ను ప్రవేశ పెట్టారు. ఈ టాక్స్ నిర్ణయించటం కోసం అక్కడ అధికారి ఆ బ్రెస్ట్ టాక్స్ కట్టే మహిళ స్థనాల పరిమాణం చేతులతో కొలిచి దాని ఆధారంగా టాక్స్ నిర్ణయిస్తాడు. ఈ విధానంతో ఎవరైనా బ్రెస్ట్ టాక్స్ కట్టడానికి స్థోమతున్నా జాకెట్ ధరించే ఆలోచనా చేయలేని పరిస్థితి.
ట్రావెన్ కోర్ సంస్థానంలోని తూర్పు భాగంలో ఉన్న ఛెర్తాలా గ్రామానికి చెందిన ఇఝావా (ezhava) కుల మహిళ నంగేళి. ఇఝావా కులం శూద్ర కులాలలో ఒకటి. పై భాగానికి వస్త్రం ధరిస్తుందనే సమాచారంతో బ్రెస్ట్ టాక్స్ నిర్ణయించి పన్ను వసూళ్లు చేసేందుకు అధికారి వచ్చాడు. నంగేళి తన స్థనాన్ని కోసి ఓ ఆకులోపెట్టి అధికారికి అందించింది. ఈ ఊహించని పరిణామంతో భీతిల్లిన అధికారి అక్కడ నుంచి పారిపోయాడు. స్థనాన్ని శరీరంనుంచి కోసి వేరుచేయటం వల్ల విపరీతమైన రక్తశ్రావం జరిగి నంగేళి చనిపోయింది. ఆమె దహన కార్యక్రమంలోనే అగ్నిలోకి దూకి ప్రాణత్యాగం చేసాడు నంగేళి భర్త. ఈ సంఘటనతో సమాజంలో పుట్టిన తిరుగుబాటు కారణంగా ట్రావెన్ కోర్ సంస్థానం " బ్రెస్ట్ టాక్స్" ను విరమించుకోవలసి వచ్చింది.
నంగేళి చూపిన తెగువ ఓ సమూల మార్పుకు దారితీసింది. అట్టడుగు వర్గాల స్వాభిమాన పతాకాన్ని తరతరాలు నిలబెట్టింది. గౌరవప్రదమైన సంఘజీవనాల్లో వీరూ భాగమయ్యే హోదాను అందించింది. తలెత్తుకు జీవించేందుకు చేసే ప్రయత్నం ఒక్కటే కావచ్చు, దాని అడుగూ ఒంటరిగా కనబడొచ్చు కానీ ఆ స్ఫూర్తి వేల ఉద్దీపనాలకు నాందిగా నిలుస్తుంది. వ్యవస్థ మార్పుకు కారణమై గెలుస్తుంది.
--------------- మాతంగి దిలీప్ కుమార్
ఎడిటర్ : భీమ్ భూమి & ప్రసారం మాసపత్రికలు